కొలిచిన వారికి కొంగు బంగారం.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి

కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు రేపటినుంచి ప్రారంభంకానున్నాయి. అలాగే.. ఈనెల 26న పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి యందు అవభృత స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.. వివరాలిలా ఉన్నాయి.

రేపటి నుంచి 33వ వార్షికోత్సవ వేడుకలు

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి(Jubilee Hills Sri Peddamma Thalli). మొక్కు వెంటనే తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నిత్యం వేల సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతాన లేమి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం దినాదినాభివృద్ధి చెందుతోంది. మాజీ సీఎల్‌పీ నేత దివంగత పి.జనార్దన్‌రెడ్డి కృషితో చిన్నగా ఉన్న ఆలయం ఇప్పుడు అతి పెద్ద ఆలయంగా అవతరించింది. ఇప్పుడు 33వ వార్షికోత్సవ వేడుకల కోసం ముస్తాబవుతోంది.

ఆలయ చరిత్ర

పౌరాణిక చరిత్ర ఆధారంగా ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు వచ్చిన శక్తి స్వరూపిణి పెద్దమ్మతల్లి. జూబ్లీహిల్స్‌(గతంలో కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం)లోని బావి వద్ద సేద తీర్చుకోవడానికి వచ్చి అక్కడే కొలవు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అప్పుడే ఆమె చిన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ విగ్రహం ఉండడం గమనించిన కొందరు గిరిజనులు చిన్నగా గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అనంతరం అది చిన్న ఆలయంగా మారింది.

ఆలయం చుట్టుపక్కల కొండలు, గుట్టలతోపాటు చెట్లు విపరీతంగా ఉండి ఇది చిట్టడివిగా కనిపించడంతో చాలామంది అటు వైపు వెళ్లేందుకు భయపడే వారు. ఆదివారం, మంగళవారం కొందరు ఉదయమే వచ్చి ఇక్కడ వనభోజనాలు వండుకొని తినేవారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వారు. తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వర్యంలో బిజ్జుమళ్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజే ఆర్‌ ఆలయాన్ని పునర్నిర్మించారు.

పీజేఆర్‌ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనవాయితీగా పెట్టుకునే వారు. జూబ్లీహిల్స్‌తో పాటు మాదాపూర్‌ ధనవంతుల కాలనీగా మారడంతో జనసంచారం కూడా పెరిగింది. క్రమంగా అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించారు. ఆలయంలో కట్టడాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ప్రారంభంలో ఆర్చీ మొదలుకొని అనిచోట్లా దేవతామూర్తులు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తారు. ఆలయ ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతోంది. ప్రధాన ఆలయం ముందు మధురై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దీపాంత భక్తులను ఆకర్షిస్తోంది.

రథసప్తమి రోజు రథోత్సవం

పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలతోపాటు విశేష పూజలు నిత్యం జరుగుతుంటాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పెద్దమ్మ తల్లి విగ్రహం రథోసప్తమి రోజున ప్రతిష్ఠాపన జరిగింది. ఈ తరుణంగా ప్రతి యేటా అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని రథంపై ఉంచి పలు వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఈనెల 25న రథోత్సవం జరపనున్నారు. ఈనెల 26న పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి యందు అవభృత స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.

వార్షికోత్సవం పూజలు ఇలా..

ఈనెల 23న ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లి అభిషేకం, మంత్రపుష్పము, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అఖండదీపారాధన, వేద పారాయణము, నవగ్రహజపములు, రుద్రాభిషేకం, సాయంత్రం అమ్మవారి ఉత్పవమూర్తి పల్లకి సేవ నిర్వహిస్తారు. ఈనెల 24న మండపపూజలు, వేదపారాయణము, అరుణ, పంచోపనిషత్‌, దేవీభాగవత, మహావిద్యా, చండీపారాయణాదులు, సామూహిక లలితాసహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top