CP VC Sajjanar: న్యూ ఇయర్ వేడుకలు ఇంట్లో చేసుకుంటారా?.. పోలీసు స్టేషన్లో చేసుకుంటారా?

నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణకు నగర పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. “జీరో డ్రగ్స్” విధానమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. వేడుకల సమయంలో నగరంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
శనివారం డీసీపీలు, ఉన్నతాధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీపీ, 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్లో మొత్తం నేరాల రేటు 15 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన వివరించారు. పోలీసుల నిరంతర నిఘా, వేగవంతమైన స్పందన కారణంగా పలు విభాగాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయని నివేదిక పేర్కొంది.

